Thursday, November 29, 2018

జీవిత సత్యం నేర్పిన గురువు - Enjoy every moment

జీవిత సత్యం నేర్పిన గురువు

చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న
స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తోంది . బాగా సెటిల్ అయ్యారు . కానీ జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఇదే విషయం గురించి చర్చించారు...
కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.

ఆ మాస్టారూ పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...! ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....
అతనొక స్పూర్తి ! అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...

ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!

ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!

ఆయన చెప్పిన పాఠాల మూలంగానే  ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,
సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.

ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!

ఇదంతా విన్న ఆ గురువు
కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.

కొద్ది సేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి  వేడి వేడి టీ ని  ఓ కేటిల్‌లో తీసుకుని వచ్చింది.

ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను
(పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకా పూతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.

వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!

వాళ్లంతా టీ  తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..

‘‘మీరంతా గమనించారా...
టీ మీ ముందుకు రాగానే ,  ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ  తాగారు..ఫలితం...
ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!

అందరూ తాగే టీ
ఒకటేఅయినా... తాగుతూ..
ఇతరుల టీ  కప్పు,
దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...
 ఫలితం...తాగే
 "టీ ని  అస్వాధించడం" మరిచిపోయారు..

అదే సకల సమస్యలకు మూలం....

ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...
వాటి వెంట పరిగెడితే ఇక అంతే...!

మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!

ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,
ఎంత రిచ్‌గా ఉన్నారో...
ఏ హోదాలో ఉన్నారో,
ఏం కొంటున్నారో
అని పొల్చుకొని...
మధన పడుతూ...
వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ
మీ ఇష్టాఇష్టాలను,
మీ అభిరుచులను
అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...

మీ జీవితం టీ అయితే.....
మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా
టీ కప్పులాంటివి..

కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని  ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు.
 అదే జీవిత సత్యం...

Sunday, November 11, 2018

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?


అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.
🍃🍃🍃
అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, 'నేను వెళ్తున్నా' అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా' ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓

అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ.

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా?

నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపు కున్నాను.

ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే వున్నాయి కదా!ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి.

నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట

అడుగు తీసి అడుగు వేయ డానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు.

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను?

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?

నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం?

నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా! నా ఇంటికి ఉన్న 9-ద్వారాలకూ సమస్యలే.

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు .. డబ్బు జబ్బు.  నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా?

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా?

ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు.

ఇంకొకడిని అణగతొక్కడానికి  నాతో కుట్రలు చేయించావు.

ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా, చేసావో గుర్తు తెచ్చుకో.

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా?
ఇక నేనుండలేను వెళ్తున్నా!

👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువ య్యింది.
దాంతో ఈ రోజు, ఈక్షణాన్ని ఆనందించడం మరచి పోతున్నాడు.
దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?